తిరుపతి : కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డైరీ) ప్రతినిధులు గురువారం టీటీడీ ఈవో(TTD EO) జె.శ్యామలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో కేఎంఎఫ్ ప్రతినిధులు నందిని డైరీ (Nandini Milk ) ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిటి) ద్వారా వివరించారు.ఈ సమావేశంలో టీటీడీ జేఈవో గౌతమి, కేఎంఎఫ్ ఎండి ఎంకె జగదీష్, డైరెక్టర్లు రఘునందన్, రాజశేఖర్ మూర్తి, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి (Laddu adultration, ) వాడినట్లు తేలడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. లడ్డూ తయారికి ఉపయోగించే నెయ్యిని టెండర్ ప్రక్రియ ద్వారా పలు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన నందిని డైరీ కూడా తిరుమలకు నెయ్యిని సరఫరా చేస్తుంది.
ఈ సమయంలో నందిని డైరీ ప్రతినిధులు తిరుమల అధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుమలకు స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేస్తున్న తమ డైరీకి మరి కొన్ని టన్నుల నెయ్యి సరఫరాకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా టీటీడీని కోరినట్లు సమాచారం .