Nallari Kirankumar Reddy | కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలుస్తారని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఏపీ విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇటీవల మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే హస్తం పార్టీని వీడి.. బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కిరణ్ కుమార్‌రెడ్డి ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రి. ఉమ్మడి ఏపీకి స్పీకర్‌గానూ పని చేశారు. ఏపీ విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీని స్థాపించినా.. ఆ తర్వాత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 2014 ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత కాంగ్రెస్‌లో మళ్లీ చేరారు. ఆ తర్వాత పార్టీకి పూర్వవైభవం తెస్తారని భావించినా.. ఆయన అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో హస్తం పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది.