Mudragada | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు (Ap Politics) రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలో ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తమ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీకి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్య నేతలంతా సమావేశాలతో తీరికలేకుండా గడుపుతున్నారు.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) పాలిటిక్స్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవలే తాను ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతానంటూ ముక్తసరిగా చెప్పారు. దీంతో ముద్రగడ ఏ పార్టీలో చేరుతారు..? అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ముద్రగడతో టీడీపీ, జనసేన నేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
కాకినాడ కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి జనసేన నేతలు క్యూ కట్టారు. బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ, కాపు జేఏసీ నేతలు ముద్రగడతో భేటీ అయ్యారు. అయితే, తాము ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశామని నేతలు తెలిపారు. మరోవైపు, మరో రెండుమూడు రోజుల్లో జనసేన ముఖ్యనేతలు ముద్రగడను కలిసే అవకాశం ఉందని సమాచారం. జనసేన నేతలు తనను కలవడంపై ముద్రగడ పెదవి విప్పడం లేదు. అయితే, ఆయన జనసేన పార్టీలోకి చేరబోతున్నారంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ముద్రగడ కలవబోతున్నట్లు సమాచారం. మరోవైపు ముద్రగడ.. టీడీపీలోకి వెళ్లే అవకాశం కూడా ఉందంటూ రాజకీయ నిపుణులు అంటున్నారు.
ఈ ప్రచారం నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గిరిబాబు మాట్లాడారు. ముద్రగడ… టీడీపీ, జనసేన ఏ పార్టీలోకైనా వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అధికార వైసీపీలోకి వెళ్లేందుకు ముద్రగడ ఆసక్తిగా లేరని స్పష్టతనిచ్చారు.
Also Read..
fuel leak | పవర్ స్టేషన్ నుంచి భారీగా ఇంధనం లీక్.. మణిపూర్‌లో ఘటన
Aadhar | ఆధార్ డాటాపై ఫికర్.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్న వివరాలు!