హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి తీసుకుని బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి నది నుంచి వృథాగా సముద్రంలోకి పోతున్న 3000 టీఎంసీల నుంచి ఏపీ 200 టీఎంసీలు తీసుకుంటుందని వెల్లడించారు. అది కూడా 100 రోజుల వరద సమయంలో ప్రతిరోజు రెండు టీఎంసీల చొప్పున 200 టీఎంసీలు తీసుకోవాలన్నది తమ ఆలోచన అని తెలిపారు. ఈ విషయాలపై ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో అధికారికంగా వివరాలు అందించామని చెప్పారు. ఆ వివరాలతోనే అనుమతుల కోసం సీడబ్ల్యూసీ, పర్యావరణ అనుమతుల (ఈసీ) కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈసీ కొన్ని అభ్యంతరాలు తెలిపితే అధికారులు సవరించి మళ్లీ ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు. గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి పోతున్నదని, అవకాశం మేరకు తెలంగాణ వినియోగించుకుంటుందని, తర్వాత ఏపీ వినియోగించుకుంటుందని చం ద్రబాబు చెప్పినట్టు గుర్తుచేశారు. తెలుగు ప్రజలు బాగుండాలన్నదే బాబు అభిమతం అని చెప్పారు. ఢిల్లీ సీఎంల భేటీలో తాము వ్యక్తపరిచామని వివరించారు.
ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల భేటీ అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల అంశమే ఎజెండాలో లేదని అన్నారు. గోదావరిపై బనకచర్ల కడుతామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేం ఆపమని చెప్పడానికి అంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు. ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదనే ఎజెండాలో లేనప్పుడు, మేము ఆపమనే చర్చే రాదంటూ బొంకారు. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి స్పష్టంగా లెక్కలతో సహా సీఎంల భేటీలో వివరించామని చెప్తుంటూ సీఎం స్థానంలో ఉండి రేవంత్ అబద్ధాలు ఆడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు లాభం చేకూర్చేలా సీఎం రేవంత్ ప్రయత్నించొద్దని నిపుణులు కోరుతున్నారు. హక్కుగా రావాల్సిన నీళ్లను ఏపీ ్ల తరలించుకుపోయే కుట్రలు చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడుతున్నారు.