అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రధానంగా విశాఖ లోక్సభ (Visakha Lok Sabha) స్థానంపై అందరి దృష్టి పడింది. ఈ లోక్సభ స్థానం నుంచి అత్యధికంగా అభ్యర్థులు పోటీ చేస్తుండడం ప్రధాన కారణం. ఈ నియోజకవర్గం నుంచి 39 మంది నామినేషన్లు వేయగా వీటిలో ఆరు నామినేష్లను(Nominations) అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం ఇక్కడ 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే విధంగా రాజమహేంద్రవరం(Rajamahendravaram) లోక్సభ స్థానానికి అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు.
తిరుపతి శాసనసభ స్థానం నుంచి అత్యధికంగా 46 మంది చేస్తుండగా, రంపచోడవరంలో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ స్థానాలకు 2, 387 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కూటమి తరుఫున టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా వైసీపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీలు ఒకటి, రెండుచోట్ల నుంచి తలపడుతున్నాయి.
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధిక కేసులు ఉన్న ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ (పులివెందుల) పోటీ చేస్తున్నారు. అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్( గుంటూరు) నుంచి పోటీ చేస్తున్నారు.