Tirumala | తిరుమలలో మరోసారి దర్శన టికెట్ల దందా బయటపడింది. పుదుచ్చేరి సీఎం సిఫారసు లెటర్‌తో బ్లాక్‌లో టికెట్లు అమ్మడంతో పాటు భక్తులను మోసం చేస్తున్న ఓ దళారి బాగోతం వెలుగులోకి వచ్చింది. వీఐపీ బ్రేక్ దర్శనం చేయిస్తానని నమ్మించి భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడంతో పాటు వారిని 300 ప్రత్యేక దర్శనం లైన్లో వదిలేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.
పుదుచ్చేరి ప్రభుత్వ పీఆర్వో అని చెప్పుకుని పద్మనాభన్ అనే దళారి తిరుమలలో తన చేతివాటం ప్రదర్శించారు. పుదుచ్చేరి సీఎం సిఫారసు లేఖపై ఆయన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందాడు. అయితే భక్తులకు మాత్రం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తానని నమ్మించి నెల్లూరుకు చెందిన ఐదుగురు భక్తుల నుంచి రూ.23వేలు వసూలు చేశాడు. అనంతరం వారిని 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం లైన్లో వదిలేశాడు. ఇది గమనించిన సదరు భక్తులు దళారీని నిలదీశారు. వీఐపీ బ్రేక్ దర్శనం అని చెప్పి రూ.300 లైన్లోకి తీసుకొచ్చావేంటని ప్రశ్నించారు. దీనికి దళారి సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వారు వెళ్లి టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని ఆశ్రయించారు.
భక్తుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. ఈ దర్శన టికెట్ల అంశంపై విచారణ చేపట్టారు. పద్మనాభన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ వ్యవహారంపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో టీటీడీ విజిలెన్స్ వింగ్ ఏవీఎస్వో శ్రీధర్ ఫిర్యాదు చేశారు.