అమరావతి : మహాత్మాగాంధీ (Mahatma Gandhi) 77వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖులు నివాళి అర్పించారు. టీడీపీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల , మంత్రి నారా లోకేష్ మహాత్ముడికి నివాళి అర్పించారు.
అహింసను పరమోధర్మంగా చెప్పిన మహాత్ముడు స్మరణీయుడని ట్విటర్లో చంద్రబాబు ( Chandra Babu) అన్నారు . ఆయన బోధనలు నేటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ అని నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మాగాంధీ ఒకరని వెల్లడించారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారు. భారతదేశంపై చెరగని ముద్ర వేశారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అహింస వాదంతో ఏమైనా సాధించవచ్చని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan) ట్విటర్లో పేర్కొన్నారు. గాంధీగారి సిద్ధంతాలు, ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శనీయమని పేర్కొంటూ నివాళి అర్పించారు.
సత్యం, అహింస బాపూజీ నమ్మిన సిద్ధాంతాలని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటివి బాపూజీ పోరాట ఆయుధాలని వైఎస్ షర్మిల ( YS Sharmila) పేర్కొన్నారు. కుల వివక్ష, మత విద్వేషాలకు ఎదురునిలిచిన మహాత్ముడని పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలు, ఆలోచనలు ప్రపంచమంతా శాంతి, సౌభ్రాతృత్వానికి మార్గదర్శకమని ఆమె వెల్లడించారు.