Maha Shivaratri Brahmotsavalu | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలుకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటాన్ని ఆవిష్కరిస్తారు. ఉత్సవాల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Srisailam Temple
ఉత్సవాల సందర్భంగా ఆదిదంపతులు రోజుకో వాహనంపై భక్తులను అనుగ్రహించనున్నారు. 20న రాత్రి భృంగివాహన సేవ ఉంటుంది. 21న హంసవాహనంపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. 22న మయూర వాహనసేవ, 23న రావణవాహనసేవ, 24న పుష్ప పల్లకీసేవ, 25న గజవాహన సేవ, 26న మహా శివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం, నందివాహనంపై శివపార్వతులు విహరిస్తారు. అలాగే, లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం జరుగుతుంది. 27న రథోత్సవం, 28 యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణం, మార్చి ఒకటిన అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Srisailam Temple
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో మార్చి ఒకటో తేదీ వరకు ఆర్జిత సేవలు, పరోక్ష సేవలను నిలిపివేశారు. ఉత్సవాల సమయంలో భక్తులకు కేవలం అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నారు. జ్యోతిర్ముడి శివదీక్షాభక్తులకు మాత్రం ఉత్సవాల్లో ఐదురోజుల పాటు అంటే.. 19 నుంచి 23 వరకు నిర్ణీత వేళ్లలో స్వామివారి స్పర్శ దర్శనాలు కల్పించనున్నారు. 23 నుంచి రాత్రి 7.30 గంటల నుంచి మార్చి ఒకటో తేదీ రాత్రి వరకు స్వామివారి స్పర్శ దర్శనాలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఉత్సవాల సమయంలో 19 నుంచి ఒకటో తేదీ వరకు వీఐపీలకు విరామ దర్శన వేళలో మాత్రమే దర్శనాలు కల్పిస్తామని.. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు విరామ దర్శనాల సమయంలో దర్శనం ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తొలి విడుతలో ఉదయం 6.30గంటల నుంచి 7.30 గంటల వరకు.. రెండో విడుతలో ఉదయం 10.30గంటల నుంచి 11 గంటలు, మూడో విడత మధ్యాహ్నం 2.30గంటల నుంచి 3గంటల వరకు, నాల్గో విడుతలో 7 గంటల నుంచి 7.30 గంటల వరకు ఉంటాయని.. విరామ సయాల్లోనూ సర్వదర్శనాలు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు వివరించారు.
Srisailam Temple
భక్తుల కోసం ప్రత్యేకంగా మూడు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఉచిత దర్శనాలు, శీఘ్ర దర్శనాలు, అతిశీఘ్ర దర్శనం క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉచితదర్శన క్యూలైన్ రథశాల నుంచి మొదలవుతుందని తెలిపారు. సర్వదర్శనం భక్తులు క్యూకాంప్లెక్స్ వేచి ఉండేందుకు వీలుగా 17 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శీఘ్ర దర్శనం అంటే రూ.200 క్యూలైన్లను క్యూకాంప్లెక్స్ కుడివైపు నుంచి మొదలవుతుందని.. అతిశీఘ్ర దర్శనాల క్యూలైన్ రూ.500 క్యాంప్‌కోర్టు భవనం నుంచి ప్రారంభవుతుందని అధికారులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులకు క్యూలైన్ ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం ముందు నుంచి క్యూలైన్ ఉంటుందని వివరించారు. క్యూకాంప్లెక్స్‌లో భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్స్, మంచినీరు అందించనున్నట్లు తెలిపారు. శివదీక్షా పరులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కల్యాణమండపం నుంచి ఈ క్యూలైన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Srisailam Temple
ఉత్సవాల సందర్భంగా భక్తులకు 35లక్షల లడ్డూ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 15 కౌంటర్లలో లడ్డూ ప్రసాదాలను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. దేవస్థానం అన్నప్రసాద వితరణ భవనం వద్ద నాలుగు, గణేశ సదనం ఎదురుగా రెండు, సీఆర్వో కార్యాలయం వద్ద రెండు తాత్కాలిక లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగు రోజులు అనగా.. 24 నుంచి 27 వరకు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించనున్నట్లు చెప్పారు.
Srisailam Temple
ఉత్సవాల సందర్భంగా క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. దాదాపు పది బస్సులను ఏర్పాటు చేశారు. వివిధ పార్కింగ్ స్థలాల నుంచి ఆలయం వరకు ఈ బస్సులు నడువనున్నాయి. అలాగే, ఆలయం వద్ద 25 వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. విరాళాల కేంద్రం వద్ద వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. క్షేత్రానికి వచ్చే వాహనాల కోసం 39 ఎకరాల్లో పది చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దగ్గరలో, ఆగమ పాఠశాల ఎదురుగా ఉన్న ప్రదేశంలో, విభూతిమఠం సమీప ప్రాంతంలో, ఫిల్టర్ బెడ్, గణేశనదనం ఎడమవైపు సెంట్రల్ పార్కింగ్ ప్రదేశం, వాసవీ విహార్ వద్ద, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, ఏనుగుల చెరువు కట్ట తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Srisailam Temple
రింగ్‌రోడ్ వద్ద ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ, కర్నాటక ఆర్టీసీ బస్సులకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల కోసం క్షేత్ర పరిధిలో ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. కైలాసద్వారం, క్షేత్రపరిధిలో టోల్ గేట్, ఆలయ మహాద్వారం, శివదీక్షా శిబిరాలు, పాతాళగంగ మెట్ల మార్గం, పాతాళగంగ స్నానఘట్టాలు, మల్లమ్మకన్నీరు, టూరిస్ట్ బస్టాండ్, బస్టాండ్ తదితర చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
Srisailam Temple
బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు కూడా ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించనున్నారు. ఉత్సవాల్లో పండగ వాతావరణం ఉండేందుకు క్షేత్రపరిధిలో పలుచోట్ల స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఆలయ పుష్కరిణి వద్ద భ్రామరీ కళావేదిక, శివదీక్షా శిబిరాల వద్ద నటరాజ కళావేదిక, ఆలయ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద, గోసంరక్షణశాల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రదర్శన (యాంఫీ థియేటర్) వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో రాత్రి స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం జరుగనుండగా.. జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది.
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple
Srisailam Temple