Srisailam | శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో మహాకుంభాభిషేక ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆలయ ధర్మకర్తలమండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు విరుపాక్షయ్య, విజయలక్ష్మి, కనకదుర్గల ఆధ్వర్యంలో ఈవో పెద్దిరాజు వేదపండితులు అర్చకస్వాములచే సాంప్రదాయంగా పసుపు కుంకుమ ఫలపుష్పాదులచే ఆలయ ప్రదక్షిణలు చేసి యాగశాల ప్రవేశంతో మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.
శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో జరిగిన పూజాదికాలలో ప్రధానంగా ఉభయ దేవాలయాల ఆగమశాస్త్ర పద్దతులలో ఏర్పాటు చేసిన రెండు యాగశాలలో షోడశోపచార పూజా క్రతువులు నిర్వహించారు. ప్రధానంగా గోపూజ, గణపతిపూజ, ఋత్విగ్వరణం, దీక్షాధారణ, పర్యగ్నికరణము, యాగశాల ప్రవేశం, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, మండపారాధనలు, మూలమంత్రానుష్టాన పారాయణలు, అఖండదీపారాధన తదితర ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు తులతూగాలని సకాల వర్షాలు కురిసి పంటలు పండాలని మహాసంకల్పం పఠిస్తూ ఐదు రోజులపాటు జరిగే కుంభాభిషేక కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.