Tragedy | తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ముందురోజు అబ్బాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన అమ్మాయి మరుసటి రోజు అదే రైల్వే ట్రాక్‌పై పడుకుని తనువు చాలించింది. ఏపీలోని గుంటూరు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన గోపి నరసరావుపేటలోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. తన క్లాస్మేట్ అయిన తెనాలి మండలం అత్తోటకు చెందిన ప్రియాంకతో అతను కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇదే విషయం పెద్దలకు తెలియడంతో పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ నెల 5వ తేదీన పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. అప్పుడు పోలీసులు ఇరువైపుల పెద్దలను పిలిచి మాట్లాడారు. కానీ ఇరు కుటుంబాలు వారి పెళ్లిని అంగీకరించలేదు.
పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోలేదని గోపి, ప్రియాంక ఇద్దరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం గోపీ పేరేచర్ల సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక మరుసటి రోజు అదే రైల్వే ట్రాక్‌పై బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి రైల్వే పోలీసులు తరలించారు.