Road accident : లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. తుగ్గలి మండలం ముకెల గ్రామానికి చెందిన భూమిక (26), ఆమె కుమార్తె నితిక (5), శిరీష (30) కలిసి మరో ఊరు వెళ్లేందుకు సమీపంలోని ఆటోస్టాండ్ వద్ద ఆటోలో ఎక్కికూర్చున్నారు.
అదే సమయంలో వెనుక నుంచి బియ్యం లోడుతో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దాంతో ఆటోలో కూర్చుని ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటో నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.