అమరావతి : పదేండ్లు అన్యోన్యంగా సాగిన వారి జీవితంతో ఏడాది క్రితం మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. నిత్యం గొడవలతో సంసారాన్ని వీధిన పడేసుకున్నారు. ఎలాగైన విడిపోవాలని భావించిన సదరు దంపతులు(Couple) కోర్టు మెట్లక్కారు. విడాకుల(Divorce) కోసం కోర్టుకెళ్లిన ఓ జంట లోక్ అదాలత్(Lok Adalath) న్యాయమూర్తి చొరవతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణానికి చెందిన గిరిబాబు, తేజస్వినికి పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబంలో గొడవలు పెరగడంతో విడిపోయేందుకు లాయర్ మురుగేష్ రెడ్డిని కలిశారు.
దీంతో ఆయన సదరు దంపతులను జాతీయ లోక్ అదాలత్‌కు తీసుకొచ్చారు. పుత్తూరు సబ్‌కోర్టు సీనియర్ సివిల్ న్యాయమూర్తి రాఘవేంద్ర వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్యభర్తల గొడవతో పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని వివరించారు. కలిసి జీవించాలని న్యాయమూర్తి సూచించడంతో వారిరువురు అందుకు అంగీకరించారు. దీంతో అక్కడే ఇద్దరికి పూల దండలు మార్పించి మళ్లీ ఒక్కటి చేయడంతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది.