అమరావతి : ఏపీలోని పలు జలాశయాలు(AP reservoirs) నిండుకుండలా దర్శనం ఇస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage), శ్రీశైలం రిజర్వాయర్ (Srisailam Reservoir) లకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీకి 2,61,307 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా 50 గేట్లు 6 అడుగులు, 20 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2,46,950 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు 14,357 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీశైలం జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు 2,86,919 క్యూసెక్కులు ఇన్ ఫ్లోగా వస్తుండగా, 4,11,236 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.0439 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
శ్రీశైలం నుంచి నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయడంతో సాగర్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది. ప్రాజెక్టు నుంచి 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లు పదిఅడుగుల మేర, 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తు్న్నారు.