 
                                                            హరి హర పుత్రుడు అయ్యప్పస్వామి ఆలయమంటే అందరికి గుర్తొచ్చేది కేరళలోని శబరిమల. కానీ రాష్ట్రాలను దాటుకుంటూ అంత దూరం వెళ్లలేని భక్తుల కోసం పవిత్ర గోదావరి నదీతీరాన రాజమండ్రిలోనే ఒక అద్భుతమైన అయ్యప్ప ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ ఆలయంలో శబరిమలకు ఏమాత్రం తీసిపోకుండా మణికంఠుడికి నిత్యం ధూపదీప నైవేద్యాలు, అనేక పూజలు అట్టహాసంగా నిర్వహిస్తారు. రాజమండ్రిలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అంతటా ఎంతో పాపులరైన ఈ గుడిని 2011 మార్చి 20న అప్పటి ఎమ్మెల్యే దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు గారు నిర్మించారు. ఆయన భక్తికి, స్ఫూర్తికి ఈ ఆలయం ప్రతీకగా చిరకాలం నిలిచిపోతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. స్థల సేకరణ నుంచి నిర్మాణ వ్యయ బాధ్యతల వరకు ఆయన మీదే వేసుకుని ఏంతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.
అయ్యప్ప మాల ధరించే భక్తులు సహజంగా శబరిమలలో ఇరుముడి చెల్లిస్తారు. కానీ ఏపీలో ఉన్న ఈ గుడిలోనూ ఇరుముడి సమర్పించవచ్చు. శబరిమల మాదిరే ఇక్కడ కూడా అనేక ఉపాలయాల ఉన్నాయి. అందులో ప్రధానంగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయి బాబా, లక్ష్మీహయగ్రీవ స్వామి, మాలికాపుర అమ్మవారు, దక్షిణామూర్తి స్వామి, దత్తాత్రేయలాంటి వారి ఆలయాలు కూడా ఉన్నాయి.
ఈ గుడి నిర్మాతైన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి మరణాంతరం ఆయన కుటుంబీకులు ఆశయాన్ని కొనసాగిస్తూ ఎంతో మంది భక్తులకు సౌకర్యాలు సమకూర్చి దైవ దర్శనం కల్పిస్తున్నారు.

శ్రీ ధర్మ శాస్తా ఆధ్యాత్మిక కేంద్రంగా పిలవబడే ఈ ఆలయంలో నిత్యం మణికంఠుడి నామంతో మార్మోగుతుంది. అయ్యప్ప మాలాధారులు ఇతర భక్తులు, చిన్ని స్వాములతో ఈ గుడి నిత్యం ఎంతో సందడిగా ఉంటుంది. ఆలయ నిర్మాణం కూడా దాదాపు శబరిమల పద్ధతిలోనే ఉంటుంది. ఒక్కసారి ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కృషి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రాంత ప్రజలంతా ఈ ఆలయాన్ని అక్కడ కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని ఎంతో సెంటిమెంట్‌గా భావిస్తారని రామ్మోహన్ గారి కుమారుడు జక్కంపూడి రాజా తెలిపారు. ఆలయ నిర్వహణ వ్యయం రోజు రోజుకి పెరుగుతున్నా ఏనాడు వెనకడుగు వేయకుండా సమర్ధవంతంగా నిర్వహిస్తూ భక్తులకు నిత్యఅన్నదానం చేస్తున్నామని ఆయన వివరించారు.
శబరిమల వెళ్లాలంటే వ్యయప్రయాసలతో పాటు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అక్కడి వరకు వెళ్లలేని స్వాముల కోసమే రాజమండ్రిలో ఈ ఆలయ నిర్మాణం జరగడం దైవానుగ్రహమే అనుకోవచ్చు. గుడి నిర్మాణానికి కోటప్పకొండ నుంచి శిలను తీసుకువచ్చారని, ఇక్కడికి వచ్చే స్వాముల కోసం అన్ని ఏర్పాట్లు చేసి హిందూ సంప్రదాయాల ప్రకారం పూజలు జరిపిస్తామని జక్కంపూడి రాజా వెల్లడించారు. అంతే కాదు అయ్యప్ప స్వామి మూల విరాట్ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేయించి ప్రతిష్టించడం కూడా మరో ప్రత్యేకత అని తెలిపారు.
ఓపక్కన పుణ్యగోదావరి.. మరో వైపు అయ్యప్ప ఆలయం. ఉదయాన్నే స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు తన్మయంతో స్మరించుకోవడం చూడాలంటే ఒక్కసారైనా వెళ్లి ఈ గుడిని దర్శించుకోవాల్సిందే. ఎన్ని ఆటంకాలొచ్చినా జక్కంపూడి కుటంబీకులు మాత్రం స్వామి వారి సేవే ప్రధాన లక్ష్యంగా ఆలయ అభివృద్ధికి ఇతోదికంగా సాయం చేస్తున్నారు. ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ దాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న జక్కంపూడి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించాల్సిందేనని స్థానికలు చెప్తున్నారు.
 
                            