 
                                                            Pawan Kalyan | కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పారిశుధ్యం, తాగు నీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు. శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓ, ఆర్డీవోలు, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, వ్యవసాయ, విద్యుత్ శాఖలతోపాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో జరిగిన నష్టం వివరాలపై ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుపాను అనంతరం తీసుకుంటున్న ఉపశమన చర్యలు, ఆస్తి, పంట నష్టం అంచనాలపై దిశా నిర్దేశం చేశారు.
కాకినాడ జిల్లా పరిధిలో మొత్తం 21 మండలాలు, ఏడు మున్సిపాలిటీలు ప్రభావితం అయినట్టు కలెక్టర్ షాన్ మోహన్ వివరించారు. మొత్తం 61 ఇళ్లు దెబ్బ తినగా, 41,932 కుటుంబాలపై మొంథా ప్రభావం చూపినట్టు తెలిపారు. అందులో 27,624 మత్స్యకార, 313 చేనేత కుటుంబాలు ఉన్నట్టు చెప్పారు. 21, 711 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, 668 ఎకరాల్లో అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. మొత్తం 33,596 మంది రైతులు తుపాను కారణంగా నష్టపోయినట్టు తెలిపారు. విద్యుత్ పరికరాలు, రోడ్లు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టు వివరించారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే వరి, ఉద్యాన పంటలు కలిపి 2,500 మంది రైతులు వరకు పంటలు నష్టపోయినట్టు చెప్పారు. అంతటా ఉపశమన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పంట చేతికి వచ్చే సమయానికి తుపాను బారినపడిందని అన్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి రాకుండా పోయిందన్నారు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకీ ప్రభుత్వం నుంచి పరిహారం అందాలని సూచించారు. కష్టంలో ప్రభుత్వం మాకు తోడుందని రైతు సంతృప్తి చెందేలా యంత్రాంగం చర్యలు ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా పంటనష్టం అంచనాలు రూపొందించే సమయంలో రైతుల పక్షాన నిలబడి పక్కాగా నివేదికలు రూపొందించాలన్నారు. దీంతోపాటు ఆస్తి నష్టం వివరాలు కూడా రూపొందించాలన్నారు. దెబ్బ తిన్న ఇళ్లకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలని సూచించారు. తుపాను అనంతరం గ్రామాల్లో పల్లపు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. గ్రామాల వారీగా పారిశుధ్య కార్యక్రమాలు ఎంత వరకు వచ్చాయో ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. ఎంత మేర రోడ్లు దెబ్బతిన్నాయో గుర్తించి,పాక్షికంగా దెబ్బ తిన్న చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
” ఉప్పాడ తీర ప్రాంతంలోని సుబ్బంపేట వద్ద సముద్ర కోత నుంచి రక్షణకు రాళ్లతో తాత్కాలిక రక్షణ గోడ ఏర్పాటు చేశాం. ఇది సముద్రపు కోతను నిలువరించగలిగింది. మిగిలిన తీర ప్రాంత గ్రామాలకు కూడా ఈ రాళ్ల గోడ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటాం. శాశ్వత రక్షణ గోడ నిర్మాణం పూర్తయ్యే వరకు ఇది తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తుంది. తీర ప్రాంత గ్రామాల రక్షణకి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలి” అని పవన్ కల్యాణ్ అన్నారు.
తుపాను అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. కోతకు గురవుతున్న ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట, అమీనాబాద్, సుబ్బంపేటల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని అధికారుల ద్వారా తెలుసున్నారు. ‘మొంథా తుపాను పిఠాపురం నియోజక వర్గం మొత్తం ప్రభావం చూపింది.. తుపాను అనంతరం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగినట్టు సమాచారం వచ్చింది. పిఠాపురం పట్టణం పరిధిలోని కరివేపాకు పేట ప్రాంతం వద్ద పల్లపు ప్రాంతాల్లో వర్షం నీరు ఇంకా నిలిచి ఉన్నట్టు తెలిసింది. ఆ నీటిని తక్షణం బయటికి పంపే ప్రయత్నం చేయాలి. దోమలు పెరిగి, వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యపు చర్యలు చేపట్టాలి అంటు వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్న చోట వైద్య శాఖను అప్రమత్తం చేయాలి. ఏలేరు కాలువ గొర్రెకండె గట్టు వద్ద కొంత బలహీనంగా ఉన్నట్టు తెలిసింది. ముంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన కాలువ గట్లు పటిష్టపరచండి. తుపాను కారణంగా మల్లవరం ప్రాంతంలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. పత్తి పంట నష్టంపై తక్షణం అంచనాలు రూపొందించి వారికి న్యాయం జరిగేలా చూడాలి’ అని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
 
                            