 
                                                            AP News | ఏలూరు జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. భర్తతోనే కాకుండా బావతో కూడా కాపురం చేసి పిల్లలను కనాలని చిన్న కోడలిని అత్తామామలు వేధింపులకు గురిచేశారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో 10 రోజులుగా గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా టార్చర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, మానవ హక్కుల సంఘం నేతలు ఆమెను చివరకు రక్షించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రంజిత్కుమార్తో పోలవరం గ్రామానికి చెందిన యువతికి రెండేళ్లకు ముందే వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. అయితే, రంజిత్ కుమారుడు అన్న ప్రవీణ్‌కు వివాహం జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో బావతో పడుకుని పిల్లలను కనాలని అత్తామామలు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందుకు సదరు యువతి అంగీకరించకపోవడంతో ఆమెను ఇంట్లోనే నిర్బంధించారు. 10 రోజులుగా ఆమెను బంధించి వేధింపులకు గురిచేయడంతో బాధితురాలి అన్న పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, మానవ హక్కుల సంఘాల నేతలు బాధితురాలిని రక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
తన చెల్లిని తీవ్రంగా వేధిస్తున్నారని బాధితురాలి అన్న ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాగా, బాధితురాలిని వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు, స్థానికులు, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
 
                            