అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP) లాంటి రాజకీయ పార్టీ ఉండడం రాష్ట్రానికి దురదృష్టకరమని ఏపీ సీఎం చంద్రబాబు(Chandra babu) అన్నారు. ఇటీవల ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విజయవాడకు వరదలు (Flood) వచ్చాయని ఆరోపించారు.
బుడమేరుకు పడ్డ గండ్లను వైసీపీ ప్రభుత్వం పూడ్చకపోవడంతో ఉపద్రవం వచ్చిందని అన్నారు. వాతావరణంలో మార్పులతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని , ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా బెజవాడను వరదలు ముంచేశాయని పేర్కొన్నారు. 50 టన్నుల బరువున్న బోట్లతో ప్రకాశం బ్యారేజీని(Prakasam Barrage) దెబ్బతీయాలని కుట్ర చేశారని ఆరోపించారు.
నాలుగు బోట్లను కృష్ణానదిలో వదిలిపెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. అనుకోనిది ఏదైనా జరిగి ఉంటే ప్రకాశం బ్యారేజీ ఉండేది కాదని, లంక ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని వెల్లడించారు. బోట్లపై వైసీపీ రంగులున్నాయని, ఆ బోట్లు వైసీపీ వాళ్లవేనని స్పష్టం చేశారు. బోట్లు టీడీపీ వాళ్లవేనని వైసీపీ అడ్డగోలు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. బాబాయ్‌ను చంపి గుండెపోటు అని చిత్రీకరించినట్లుగానే బోట్లు మావి కావని బుకాయిస్తున్నారని బాబు ఆరోపించారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు ఈనెల 17 లోగా నష్టపరిహారం అందిస్తామని తెలిపారు.