YS Jagan | చెప్పిన హామీలను అమలు చేయడం చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీకు జగన్ గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికైనా ఉందా అని కూటమి నాయకులను వైసీపీ ప్రశ్నించింది. నాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు ప్రతిసారీ విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజల నడ్డి విరిచారే కానీ.. తగ్గించిన దాఖలాలు ఏఒక్కసారైనా ఉన్నాయా అని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు.
1 చంద్రబాబు పాలనలో విద్యుత్ రంగం కుదేలైన మాట వాస్తవం కాదా?
2 విద్యుత్ అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకున్న మాట నిజం కాదా?
3 చంద్రబాబు అధికారంలోకి రాకముందు డిస్కంలకు రూ.29 వేల కోట్ల అప్పులు, బకాయిలు ఉంటే, ఆయన దిగిపోయే నాటికి అవి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకింది గుర్తు లేదా?
4 బాబు హయాంలో ప్రభుత్వం నుంచి డిస్కంలకు రూ.13,255 కోట్లు మాత్రమే ఇస్తే, జగన్ హయాంలో రూ.47,800 కోట్లు డిస్కంలకు సహాయం చేసింది మరిచిపోయారా?
5 చంద్రబాబు హయాంలో పవన విద్యుత్ పీపీఏలు చూస్తే.. 2014–19 మధ్య 3,494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. రూ.4.84 నుంచి రూ.4.83వరకు. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చింది. సోలార్కు సంబంధించి.. 2,500 మెగావాట్లకు ఆయన పీపీఎలు చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ 6.49కి కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. 2015లో రూ.5.96కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం, 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50కి కొనుగోలు చేశారు. చంద్రబాబు హయాంలో విండ్ పవర్ యావరేజ్ యూనిట్ ప్రైస్ రూ.4.63 అయితే.. సోలార్ యూనిట్ రూ.5.90. సోలార్ ఎనర్జీని యావరేజ్‌గా రూ.5.90కి కొనుగోలు చేశారు. ఇవన్నీ మీరు మరిచిపోవచ్చేమో కానీ.. ప్రజలు ఎవరూ మరిచిపోలేదు?
6 గుజరాత్లో రూ.1.99కే విద్యుత్ వస్తుంటే సెకీతో రూ.2.49లకు ఎందుకు ఒప్పందం చేసుకున్నారని మాట్లాడున్న చంద్రబాబు, టీడీపీ నేతలకే చెబుతున్నాం. అయ్యా చంద్రబాబూ.. గుజరాత్లో కానీ, రాజస్థాన్‌లో కానీ ఎడారి ప్రాంతాలు. అక్కడ ఇర్రేడియేషన్ లెవల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ 23.5 శాతం నమోదైతే, మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవల్స్ వల్ల 17 నుంచి 18 శాతం ఉంటాయి. దాని వల్ల గుజరాత్, రాజస్థాన్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో 50 పైసలు వారికి అడ్వంటేజ్ ఉంటుంది. ఇక్కడ మరో విషయం గుజరాత్, రాజస్థాన్ నుంచి నుంచి విద్యుత్ సరఫరా చేయాలంటే ట్రాన్స్మిషన్ కాస్ట్ యూనిట్‌కు మరో రూ.1.98. అంటే రాజస్థాన్‌లో కానీ, గుజరాత్లో కానీ సోలార్ పవర్ రూ.1.99కి కానీ, రూ.2.10 కానీ అందుబాటులోకి వస్తే, అది ఆంధ్ర రాష్ట్రానికో, కర్ణాటకకో, తమిళనాడుకో ట్రాన్స్పోర్ట్ చేసే సరికే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జ్ మరో రూ.1.98 కూడా పడుతుంది. అంటే అప్పుడు రాష్ట్రానికి వచ్చే సరికే రేటు ప్లస్ రూ.2. అంటే మొత్తం రూ.4లు పడుతుంది..ఈ విషయం మీకు తెలియదా?
7 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరగిన ఒప్పందాల్లో లంచాలు ఉంటాయా? అవినీతి జరుగుతుందా? నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఈ విషయం తెలియదా?
8 మీరు ఎన్ని విమర్శలు చేసినా రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. రాష్ట్రంలో ఇన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా, ఏ ఒక్కరూ చేయలేని పని జగన్ అతి తక్కువ ధరకు రూ.2.49కి యూనిట్ విద్యుత్ కొనడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఘట్టమని తెలిపారు.