అమరావతి : విశాఖలో జరుగుతున్న సీఐఐ ( CII ) లో సదస్సులో 613 ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra babu) వెల్లడించారు. సదస్సులో భాగంగా రెండోరోజు శనివారం చంద్రబాబు మాట్లాడారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి చీకటిపాలన అందించారని విమర్శించారు. గత ప్రభుత్వ విధానాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కూటమి పనిచేస్తుందని , దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు.
సదస్సులో పెట్టుబడుల ( Investments ) ద్వారా 16 లక్షల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో 5,587 మంది పాల్గొన్నారని, వీరిలో 640 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 1,130 మంది దేశీయ ప్రతినిధులు పాల్గొన్నారని వివరించారు.
మూడు రోజుల్లో కలిపి రూ. 16లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని అన్నారు. గడిచిన 17 నెలల్లోనే రూ. 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని వెల్లడించారు. సీఐఐ సదస్సులో అత్యధికంగా పర్యాటకంలో 122 ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచి, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే చేసుకున్న ఒప్పందాల వల్ల 25 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చరిత్ర తిరగరాసేలా విశాఖ సీఐఐ సదస్సు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు.