అమరావతి : ఏపీ ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) పార్టీ నాయకులకు తెలిపారు. నిన్న ప్రకటించిన 94 మంది దేశం అభ్యర్థులతో (TDP Candidates) ఆదివారం వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎన్నికల వరకు అభ్యర్థులు ప్రజల్లో ఉండాలని, వారి పనితీరు సరిగా లేకపోతే మార్చేందుకు వెనుకడు వేయనని హెచ్చరించారు. అభ్యర్థులు పనితీరును ప్రతివారం పర్యవేక్షించి సర్వే చేయిస్తానని తేడా వస్తే వేటు తప్పదని స్పష్టం చేశారు.
రాబోయే 40 రోజులు టీడీపీ, జనసేన (Janaseana) పార్టీకి అత్యంత కీలకమని అన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పొత్తులతో పోటీ చేస్తున్నామన్న విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అభ్యర్థి వల్ల ఎవరైనా అసంతృప్తితో ఉంటే ఒకటికి పది సార్లు స్వయంగా వెళ్లి కలవాలని స్పష్టం చేశారు. తటస్థులను కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతు కోరాలని సూచించారు.
రాష్ట్రంలో 1.3 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని, సర్వేలు పరిశీలించి, సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశానని బాబు వెల్లడించారు. జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది కాబోతోందని ఆరోపించారు. జగన్ ఎన్నికల్లో గెలుపునకు తన పాలనను నమ్ముకోలేదని, దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడని ధ్వజమెత్తారు.