YCP | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలని, టీటీడీ ఆస్తుల్లో తె లంగాణ వాటా కోరినట్టయితే హైదరాబాద్ ఆదాయంలో ఏపీకి వాటా ఇవ్వాలని వైసీపీ నేతలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన విషయాలను ఏపీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని, ఈ విషయంపై కూటమి లో ఉన్న మూడు పార్టీలు సమాధానం చె ప్పాలని, ఏపీ నుంచి పోలవరం ముంపు మండలాలు, ఓడరేవులు, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరినట్టు వస్తున్న వార్తల్లో నిజమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రూపంలో ఏపీకి పాపం తగిలిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి ఏపీకి వచ్చారని, ఏపీ ఆస్తులను వదిలేసి ఎందుకు పారిపోయి వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ ఆరంభ శూరత్వాలేనని, అనుకూల మీడియాలో ప్రచారం తప్ప సాధించిన ఫలితాలు ఏమీ లేవని ఎద్దేవాచేశారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ అంశాలకు పరిష్కారం లభించిందనే విషయాన్ని వెల్లడించలేదని చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక ఆర్కిటెక్ట్ మాదిరిగా చంద్రబాబును రేవంత్‌రెడ్డి పిలిచినట్టుందని కాకాణి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రుల సమావేశానికి దశ, దిశ లేదని, పరస్పర డబ్బా తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. 9 ఏండ్లు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలవరం గురించి ఏనాడూ ఆలోచించలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు మండలాల్లోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని తెలిపారు. టీటీడీలో కూడా తెలంగాణ వాటా అడిగినట్టు సమాచారం వచ్చిందని, దీన్ని మంత్రులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. 9,10వ షెడ్యూల్ కింద రావాల్సిన ఆస్తులు ఎన్నో ఉన్నాయని, వీటిపై చంద్రబాబు స్పందించలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు.