Chandra Babu : ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, తాను ఈసారి కూడా ప్రజలకు మేలు చేసి ఐదోసారి ముఖ్యమంత్రినవుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా ఒకే పార్టీ పాలన సాగుతోందని, ఏపీలో అదే రకమైన పాలన ఉండాలని తాను కోరుకుంటున్నానని చంద్రబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. డిసెంబర్ నెలలో అమరావతి పనులు ప్రారంభించి మూడేళ్లలో రాజధానికి ఓ రూపు తీసుకొస్తామని తెలిపారు. డిసెంబర్ నుంచి గేర్ మారుస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు. అమరావతి ఇప్పటికే పూర్తయితే ఏటా రూ.10 వేల కోట్ల నుంచి 15 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరేదని అన్నారు.