శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు క్రస్టుగేట్లు తెరవడం.. వారాంతపు సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దాదాపు 25 వేల మంది ఇవాళ ఆలయాన్ని సందర్శించినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు కిటకిటలాడాయి. కరోనా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉచిత దర్శనానికి మూడు గంటలు, శీఘ్ర దర్శనానికి గంట సమయం పట్టింది. సామూహిక అభిషేకాలు, కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొనే దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని అధికారులు సూచించారు.
వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడటంతో రాకపోకలకు తీవ్ర బ్బందులు ఎదురయ్యాయి. దేవస్థానం ఏర్పాటు చేసిన పార్కింగ్ వద్దకు వెళ్లేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా కొంతమంది అవేవి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.