Hinduja Group | ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని హిందుజా గ్రూప్ నిర్ణయించింది. యూకే పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హిందుజా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ఏపీ ప్రభుత్వం, హిందుజా గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందంలో భాగంగా హిందుజా గ్రూప్ దశలవారీగా ఏపీలో 20 వేల కోట్ల పెట్టుబడి పెట్టి, విశాఖలో హిందుజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని 1600 మెగా వాట్లు పెంచనుంది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసే అంశంపైనా ఒప్పందం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హిందుజా గ్రూప్ ప్రకటించింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్, గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి సహకరించేందుకు హిందుజా గ్రూప్ అంగీకరించింది.
హిందుజా గ్రూప్ ప్రతినిధుల కంటే ముందు లండన్లో అతిపెద్ద విద్యుత్ సరఫరా సంస్థగా గుర్తింపు పొందిన ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్డ్తోనూ చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థను ఆహ్వానించారు. అమరావతి, వైజాగ్లో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులు వివరించారు.