అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షం (Rain) దంచికొట్టింది. నెల్లూరులో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. కావలి, బోగోలు, దగదర్తి, చేజర్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నది. కోవూరు, పొదలకూరులో భారీ వర్షం కురుస్తున్నది.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నది. ఒంగోలు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి వర్షం పడుతున్నది. ఒంగోలు నగరంలో తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద పెద్దమొత్తం వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంతోపాటు కొత్తపట్నం మండలం మోతిమాల, పాదర్తి, రంగయ్యపాలెం, ఆలూరు, అల్లూరు, ఈతముక్కల, రాజుపాలెం ఆయా గ్రామాల్లో వాన దంచికొట్టడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. నగరంతో పాటు కొత్తపట్నం గ్రామాల్లో రోడ్లు జలమయమయ్యాయి.
కాగా, సోమవారం రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చాలాచోట్లు చెదురుమదులుగా భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికాంగా నమోదవుతుంని వెల్లడించారు. ప్రకాశం, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిస్తుందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది.
శ్రీలంకలోకి నైరుతి ప్రవేశం..
నైరుతి రుతుపవనాలు పది రోజుల్లో కేరళను తాకనున్నాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. వాస్తవానికి రుతుపవనాలు ఈనెల 22న అండమాన్‌కు, 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా, పది రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయని తెలిపింది. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్‌లో విస్తరించాయని, 27నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తున్నదని పేర్కొన్నది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.