Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. అర్ధరాత్రి విశాఖ-గోపాల్పూర్ మధ్యలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి మన్యం, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటలకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఏపీలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడటంతో నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒక యువతి మృతి చెందింది. మృతురాలిని మేఘన (25)గా గుర్తించారు.గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. కాగా, శిథిలాల కింద మరో ఇద్దరు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. భారీ వర్షంలోనూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అలాగే చుట్టపక్క ఇళ్లను ఖాళీ చేయించారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు సూచించారు.అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. మ్యాన్‌హోల్, కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.