అమరావతి : సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బస్ ప్రయాణికులకు ( Bus passengers ) గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఏపీలోని ప్రధాన నగరాల్లోని బస్టాండులు (Bus Stand) ప్రయాణికులతో కిటకిటలాడుతున్న దృష్ట్యా వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రైవేట్ వాహనాలను ( Private) నడుపాలని నిశ్చయించింది.
ఆంధ్రుల అతిపెద్ద పండుగ సంక్రాంతికి ( Sankranthi) పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినందున ఖాళీగా ఉండే స్కూల్, కళాశాల బస్సులను రద్దీ ప్రాంతాల్లో నడిపించి వారిని గమ్యస్థానాలకు చేరవేయాలని ఆదేశించింది. ఈ మేరకు విజయవాడలో చంద్రబాబు ( CM Chandrababu) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ అనంతరం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రద్దీ ఉండే నగరాల్లో వెంటనే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులను నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ( RTC MD ), డీజీపీ ద్వారకా తిరుమలరావుకు సూచించారు. ఈ బస్సులన్నీ ఆర్టీసీ ద్వారా నడిపి ప్రయాణ కష్టాలు లేకుండా చూడాలని ఆదేశించారు.
పండుగకు ముందు రెండవ శనివారం, ఆదివారం కలిసి రావడంతో ప్రజలు రెండు రోజుల ముందుగానే తరలివస్తుండడంతో జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. ఆర్టీసీ బస్సులతో పాటు సొంత వాహనాల్లో స్వస్థలాలకు బయలు దేరారు.
ముఖ్యంగా ఆయా టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఏపీలోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, తదితర పట్టణాల గుండా గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు భారీగా తరలిరావడంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. రైల్వే స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉంది.