Kurnool Bus Fire | పుట్టిన రోజు నాడు ప్రాణాలతో బయటపడ్డానని.. ఆ దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో నుంచి బయటపడ్డ రాంరెడ్డి అనే ప్రయాణికుడు ఎమోషన్ అయ్యాడు. ఇలాంటి ప్రమాదాలు ఇంకెప్పుడూ జరగకూడదని.. కళ్ల ముందు అలాంటివి చూడకూడదని అన్నారు. దెబ్బకు బస్సు ఎక్కొద్దనే భయం పుట్టిందని చెప్పుకొచ్చారు.
‘ ప్రమాదం జరిగేప్పటికి నేను గాఢ నిద్రలో ఉన్నాను. ప్రమాదం ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు.. కొంతమంది డోర్లు పగులకొడుతుండటంతో ఆ శబ్దానికి నిద్రలేచా. ఏం జరుగుతుందని అడిగేలోపే బస్సు మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. ఏమవుతుందో ఏం అర్థంకాలేదు. ఈలోపే కొంతమంది బస్సు అద్దాలు పగులకొట్టి కిందకు దూకేశారు. ఆ టైమ్లో ఎవరో నన్ను కూడా బయటకు లాగేశారు. నన్ను బయటకు ఎవరు తీసుకెళ్లారో.. నా చెయ్యి పట్టుకుని లాగారా.. కాలు పట్టుకుని లాగారా.. అనేది కూడా అర్థం కాలేదు. చూసుకునేసరికి బస్సు బయట ఉన్నా.’ అని రాంరెడ్డి అనే ప్రయాణికుడు ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డాడో వివరించారు. బస్సులో నేను చివరి సీటులో కూర్చున్నా.. కాబట్టే అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయపడ్డానని వ్యాఖ్యానించారు.
కారులో నుంచి బయటకు వచ్చిన తర్వాత రక్తం కారుతూ ఉన్న నన్ను, మరికొంతమందిని కారులో వచ్చిన ఓ వ్యక్తి మమ్మల్ని ఆస్పత్రిలో చేర్పించారని రాంరెడ్డి తెలిపారు. పుట్టిన రోజు నాడు దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడని పేర్కొన్నారు. నన్ను బస్సులో నుంచి బయటకు తీసుకొచ్చి రక్షించిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యాడు.