AP News | హైదరాబాద్ : అన్నమయ్య జిల్లాలో విషాదం నెలకొంది. వరద నీటిలో గల్లంతై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇలియాస్(6) అనే బాలుడు వరద వల్ల మురుగు నీటిలో పడిపోయాడు. అప్రమత్తమైన తల్లి తన కుమారుడిని కాపాడేందుకు యత్నించగా ఆమె కూడా ఆ కాల్వలో పడిపోయింది. వీరిద్దరిని కాపాడేందుకు గణేశ్(30) యువకుడు యత్నించాడు. చివరకు అతను వరదకు కొట్టుకుపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గవర్నర్ కళ్యాణ మండపం సమీపంలో ముగ్గురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు.
మరోవైపు రాయచోటి పట్టణంలోనే కే.రామాపురంలో స్కూల్ నుండి పిల్లలను తీసుకొని వస్తుండగా వరదలో ఆటో చిక్కుకుపోయింది. ఆటోలో ఉన్న ఆరుగురు విద్యార్థులు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి ఐదుగురు పిల్లలను కాపాడారు. ఒకటో తరగతి యామిని(7) వరదలో గల్లంతై ప్రాణాలు కోల్పోయింది.