కాకినాడ: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఒడిశా నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ అయింది. దీంతో లారీని హైవే పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
దీంతో లారీ టైరుకు పంక్చర్ వేస్తున్న ముగ్గురితోపాటు అదే మార్గంలో వెళ్తున్న మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను నక్కబొక్కలపాడుకు చెందిన లారీ డ్రైవర్లు దాసరి కిషోర్, దాసరి సురేశ్, బండి నాగయ్య, దిమ్మిలి రాజుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బస్సు వివరాలను సేకరించారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.