AP News | కృష్ణా జిల్లా యనమలకుదురులో విషాదం నెలకొంది. మగబిడ్డ కావాలని అత్తింటివారి వేధింపులు భరించలేక ఐదు నెలల గర్భిణీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన శ్రీకాంత్‌కు కావ్యశ్రీతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మొదట ఒక పాప జన్మించింది. ఇప్పుడు మళ్లీ కావ్యశ్రీ కడుపుతో ఉంది. ఈ క్రమంలో మళ్లీ ఆడబిడ్డ పుడితే ఎలా అనే అనుమానంతో అత్తింటి వారు విజయవాడకు తీసుకెళ్లి సీక్రెట్‌గా లింగ నిర్ధరణ పరీక్ష చేయించారు. అందులో ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని శ్రీకాంత్ ఒత్తిడి చేశాడు. అందుకు కావ్యశ్రీ నిరాకరించడంతో.. మగపిల్లాడు కావాలని భర్తతో పాటు అత్తామామలు వేధింపులకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన కావ్యశ్రీ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మీకు వారసుడిని ఇవ్వలేనంటూ.. ఆత్మహత్య చేసుకునే ముందు భర్త శ్రీకాంత్‌కు మెసేజ్ కూడా చేసింది. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కావ్యశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.