Fact Check | తిరుమలలో అపచారం జరిగిందని.. అలిపిరి వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం వెల్లడించింది. ఆ ప్రదేశమంతా అశుద్ధం, అపవిత్రంగా ఉందని, ఇది తీవ్ర నిర్లక్ష్యమంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని ఒక వీడియోను కొందరు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు మేల్కొనాలి అంటూ భక్తుల మనోభావాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్యప్రచారమని కొట్టిపారేసింది.
సోషల్‌మీడియాలో ప్రచారం అవుతున్న ఈ విషయంపై ఆరా తీస్తే.. అది మహావిష్ణువు విగ్రహం కాదని, అసంపూర్ణంగా చెక్కిన శనీశ్వరుడి విగ్రహమని తేలిందని ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. తయారీలో లోపం కారణంగా గతంలో ఇక్కడ శిల్పాలు చెక్కిన పట్టు కన్నయ్య అనే శిల్పి దాన్ని ఇక్కడ పడేశారని వివరించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే గత పదేళ్లుగా ఆ విగ్రహం అక్కడే పడి ఉందని పేర్కొంది. కాబట్టి ఎవరూ ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని సూచించింది. అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, షేర్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.