YS Jagan | ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..? అంటూ ప్రశ్నించారు. గత ఏడాదిగా ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఉల్లి, టమాటా, చీని రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు ఎన్నడూ రోడ్డెక్కలేదని జగన్ తెలిపారు.
‘ఏపీలో రైతులకు ఎరువులు అందట్లేదు. యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేశాం. ప్రభుత్వం ఉందా..? లేదా..? అనే సందేహం కలుగుతోంది. దోచుకో, పంచుకో, తినుకో అన్నవిధంగా ప్రభుత్వ తీరు ఉంది. ప్రభుత్వం కనీస బాధ్యతను కూడా నిర్వర్తించడం లేదు. లాండ్ ఆర్డర్ మెయింటేన్ చెయ్యట్లేదు. ప్రజలు గొంతు విప్పే పరిస్థితి లేదు. రెడ్ బుక్ అంటూ ప్రజల గొంతు నొక్కుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ లేవు. ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం.. ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతున్నాయి. కూటమి పాలన ప్రజల కోసమా.. లేక దోపిడీదారుల కోసమా..?’ అని జగన్ ప్రశ్నించారు.
‘ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్తున్నాయి. రైతుల కోసం పోరాడితే అర్ధరాత్రి నోటీసులు ఇచ్చారు. రైతుల కోసం పోరాటం చేయడం తప్పా..? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మీరు ఎరువుల స్కామ్ చేయకపోతే ఈ పరిస్థితి వచ్చేదా..? రెండు నెలలుగా రైతులు అవస్థలు పడుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టనట్టుగా ఉంటోంది. ఇంత అధ్వానమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనూ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
మా ప్రభుత్వ హయాంలో ఎన్నడూ రైతులు రోడ్డెక్కలేదు. అప్పుడు లేని రైతు కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి. రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకొచ్చింది..? మీరు ఎరువుల్ని అందించి ఉంటే, ఈ పరిస్థితి ఉండేదే కాదు. మేం రైతులకు మంచి చేయాలనుకున్నాం. అందుకే రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూశాం. ఆర్బీకేలను గాలికొదిలేశారు. ఈ క్రాప్, పీఏసీలను నిర్వీర్యం చేశారు. పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు. రైతులకు సున్నా వడ్డీ పథకం ఆపేశారు. ఎరువులను టీడీపీ నేతలే పక్కదారి పట్టించారు. ఎరువుల కొరత సృష్టించి బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రభుత్వ చర్యలు లేవు’ అని జగన్ అన్నారు.
‘సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను పప్పులు, బెల్లాలకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం.. లెక్కలేనితనం, అవినీతికి పరాకాష్ట. ప్రభుత్వ కళాశాలలు, ఆస్పత్రులు ప్రభుత్వ బాధ్యత. మేము ఐదేళ్లలోనే ప్రతీ జిల్లాకూ ఓ ప్రభుత్వ ఆస్పత్రి తీసుకొచ్చాం. 2019 వరకూ చంద్రబాబు మూడుసార్లు సీఎంగా చేసినా.. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టలేదు. సీఎం చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి’ అంటూ జగన్ ధ్వజమెత్తారు.
Also Read..
Deputy CM | డిప్యూటీ సీఎం ఫొటో పెట్టొద్దని ఎక్కడ ఉంది.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు