అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరుగనున్న లోక్‌సభ(Lok Sabha), శాసనసభ (Assembly) ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4,14,01,897 మంది ఓటర్లుండగా వీటిలో ,2,03,39,851 మంది పురుష ఓటర్లు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు, 3,421, థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. రాష్ట్రంలో 1.6 లక్షల ఈవీఎం (EVM) లను వినియోగించనున్నారు.
ఎన్నికల నిర్వహణకు గాను 46,389 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పగా, 12,438 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు సీఈవో ముఖేష్‌కుమార్ మీనా (CEO Meena) తెలిపారు. 34,165 చోట్ల వెబ్‌క్యాస్టింగ్(Webcosting) ను ఏర్పాటుచేసి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో విధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3.30 లక్షల మంది సిబ్బందిని నియమించామని , 1.14 లక్షల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని వెల్లడించారు.
10 వేల మంది సెక్టర్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు (Micro observers) , 46,165 మంది బీఎల్వోలను నియమించామని ఆయన పేర్కొన్నారు. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లకు ఓటు హక్కు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ రోజు హింస జరుగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గత ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి 83 శాతం పోలింగ్ జరుగుతుందని ఆశీస్తున్నామని వివరించారు. ఏజెన్సి ప్రాంతాలైనా అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం5 వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు.