Srisialam Temple | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఏర్పాట్లను ఏపీ దేవాదాయశాఖ కార్యదర్శి వాడరేవు వినయ్ చంద్ గురువారం పరిశీలించారు. సర్వదర్శనం, శీఘ్ర, అతిశీఘ్రదర్శన క్యూలైన్లు, పాగాలంకరణ ఏర్పాట్లు, కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. క్యూలైన్ల నిర్వహణ ప్రణాళికబద్ధంగా ఉండాలని.. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు అల్పాహారం, బిస్కెట్స్ క్రమం తప్పకుండా అందించాలన్నారు.
ముఖ్యంగా తొక్కిసలాట జరుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. క్యూకాంప్లెక్సులో ప్రత్యేకంగా ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్ సిలిండర్లు సైతం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కేంద్రంలో ఎప్పుడూ వైద్యసిబ్బంది ఉండాలన్నారు. క్యూలైన్లలో అవసరమైన మేరకు లైటింగ్ ఉండాలని.. క్షేత్ర పరిధిలో పారిశుధ్యపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలన్నారు. మరుగుదొడ్లు సైతం శుభ్రంగా ఉండాలని.. నిరంతరం నీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. క్షేత్రపరిధిలో అవసరమైన అన్నిచోట్ల సమాచార బోర్డులు, సూచిక బోర్డులు ఎక్కువగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర ఆజాద్, ఈవో ఎం శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు.