అమరావతి : ఏపీలో మరో రెండు నెలల్లో ఖాళీ కానున్న రెండు పట్టభద్రులు(Graduates) , ఒక టీచర్ (Teachers) ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా నియోజకవర్గాల్లో రెండు పట్టభద్రుల స్థానాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది .
ప్రస్తుతం ఏపీలోని పట్టభద్రుల స్థానాలకు ఐలా వెంకటేశ్వరరావు, కెఎస్ లక్ష్మణారావు, టీచర్ ఎమ్మెల్సీగా పాకాలపాటి రఘువర్మ కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పదవికాలం మార్చి 29తో ముగుస్తుంది. ఈ స్థానాలను , భర్తీ చేసేందుకు గాను ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేసింది.
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ (Notification) జారీ, 10వ తేదీన నామినేషన్లకు ఆఖరు గడువు, 11న పరిశీలన , 13న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ (Polling) , మార్చి 3న కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుందని స్పష్టం చేసింది.