Postal Ballot | పోస్టల్ బ్యాలెట్‌పై రిటర్నింగ్ అధికారి సీల్ (స్టాంపు) లేకపోయినా ఫర్వాలేదని.. సంతకం ఉంటే చాలని.. అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలపై అధికార వైఎస్సార్సీపీ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. అయితే, విచారణ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ అంశంలో ఇంతకు ముందు ఏపీ సీఈవో ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకున్నట్టు ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.
అయితే, పోస్టల్ బ్యాలెట్లపై తాజా మార్గదర్శకాలతో ఇవాళ మరో మెమో ఇవ్వడంపైనా వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం చేసినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం(13ఏ)పై అటెస్టింగ్ అధికారి సంతకం చేసి.. స్టాంప్ వేయకపోయినా ఫర్వాలేదని, అయితే తన హోదాను చేతిరాతతో రాయాలని.. అలాంటి పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని గతేడాది ఎన్నికల సంఘం తెలిపింది. ఇటీవల ఏపీ సీఈవో జారీ చేసిన మెమోలో పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలని.. సీల్ లేకపోయినా ఫర్వాలేదు, హోదాను చేతిరాతతో రాయకపోయినా ఫర్వాలేదనే విధంగా మార్గదర్శకాలు ఉన్నట్లు సమాచారం.
దాంతో ఈసీ నిబంధనలు ఒకలా ఉంటే.. ఏపీ సీఈవో మెమో మరోలా ఉందంటూ అధికార వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా మెమోను వెనక్కి వెనక్కి తీసుకుంటున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ నెల 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4న కౌంటింగ్ జరుగనున్నది. ఆ రోజున పోస్టల్ బ్యాలెట్లను ఎలా లెక్కిస్తరన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.