అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి చంద్రబాబు ప్రభుత్వం మా తల్లి, చెల్లి ఫొటోలు పెట్టి డైవర్ట్ రాజకీయాలు (Diversion politics ) చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఆరోపించారు. విజయనగరం జిల్లా గుర్లలో డయోరియోతో బాధ పడుతున్న బాధితులను గురువారం పరామర్శించారు. డయేరియాతో మరణించిన బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు .
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో సమస్యలుంటాయని, మా కుటుంబ సమస్యలపై ప్రచారం ఆపి ప్రజల మీద దృష్టి పెట్టాలని సూచించారు. వాస్తవాలను దాచిపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడంతో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు దృష్టిసారించాలన్నారు.
డయేరియాతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని, బాధితులకు సాయం అందించదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. వైసీపీ హయాంలో గ్రామాలను సస్యశ్యామలం చేశామని, గ్రామ సచివాలయాల ద్వారా సేవలు అందించమన్నారు.