శ్రీశైలం అక్టోబర్ 15 : శ్రీశైల మహా క్షేత్రంలో(Srisailam) దసరా మహోత్సవ వేడుకలు(Dasara celebrations) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డవారి చక్రపాణి రెడ్డి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి పెద్దిరాజు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, విజయలక్ష్మి, కనకదుర్గ, మేరాజోత్ హనుమంత్ నాయక్, మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వనితులు తన్నీరు ధర్మరాజులు ఆదివారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ఆలయ ముఖద్వారం నుండి ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణలు చేశారు.
అనంతరం అర్చక వేదపండితులు అమ్మవారి యాగశాల ప్రవేశం గణపతిపూజ, అఖండదీపస్థాపన, దీక్షా సంకల్పం, ఋత్విగరణం, మండపారాధన, చతుర్వేద పారాయణాలు, చండీ సప్తశతీ, మహా విద్య పారాయణాలు తదితర పూజాకార్యక్రమాలు జరిపించారు. అదేవిధంగా స్వామివారి ఆలయ యాగశాలా ప్రవేశం, శివసంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ,వాస్తు పూజ, రుద్రకలశ స్థాపన, స్వామివారికి మహన్యాసపూర్వక రుధ్రాభిషేకం చేశారు. మధ్యాహ్నకాలార్చన, సహస్రనామార్చన, మహానివేదన అనంతరం సాయంకాలం జపానుష్టానాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, నవవార్చన, కుంకుమార్చన, రుద్రహోమం, చండీహోమాలతో పాటు శ్రీశైల ఖండ మహాపురాణ పారాయణం నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు వీరయ్య, మార్కండేయ శర్మ తెలిపారు.
రాత్రి సువాసినీ పూజ, కాళరాత్రిపూజలతో తొలిరోజు నవరాత్రి మహోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించినట్లు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. లోక కళ్యాణం కోసం జరిపే నవరాత్రి మహోత్సవాల వల్ల దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని మహాసంకల్పాన్ని ఋత్వికలు పఠించారు. మహోత్సవానికి శ్రీశైలప్రభ సంపాదకులు అనిల్‌కుమార్, ఏఈవో మోహన్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.