AP News | ఇష్టం లేని పెళ్లి చేశారని కట్టుకున్న భార్యపైనే కోపం పెంచుకున్నాడో ప్రబుద్ధుడు. ఆమెపై కోపంతో పెళ్లయిన మూడు నెలలకే హతమార్చాడు. అనంతరం ఆ నేరాన్ని వేరే వ్యక్తిపై మోపేందుకు ప్రయత్నించాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల్లోకి వెళ్లాడు. విజయనగరం జిల్లా బంగారమ్మపేట గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా బంగారమ్మపేటకు చెందిన తాడుతూరి అనూష, సీఆర్పీఎఫ్ జవాన్ నక్కా జగదీశ్ ప్రేమించుకున్నారు. ఈ విషయం అనూష కుటుంబసభ్యులకు తెలియడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. కానీ అనూషను పెళ్లి చేసుకోవడం జగదీశ్‌కు ఇష్టం లేదు. దీంతో బలవంతంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ పెళ్లికి జగదీశ్ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో అనూషను పుట్టింట్లోనే వదిలి ఉద్యోగానికి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుంటూ వచ్చాడు. అనూషను హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో పక్కా స్కెచ్ వేసుకుని వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా భార్యను తీసుకుని విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగాడు. అనంతరం తాను డ్యూటీపై వచ్చానని చెప్పి.. అనూషను పుట్టింటికి పంపించేశాడు. అనంతరం వైజాగ్‌లో మకాం వేశాడు.
వైజాగ్‌లో ఉండి భార్యను హత్య చేసి ఎలా తప్పించుకోవాలి? పోలీసులకు పట్టుబడకుండా ఎలా నేరం చేయాలనే దానిపై జగదీశ్ యూట్యూబ్‌లో సెర్చ్ చేసిన తెలుసుకున్నాడు. అనంతరం ఒక పథకం ప్రకారం.. ఈ నెల 16వ తేదీన రాత్రి బంగారమ్మపేట గ్రామానికి వచ్చాడు. ఎవరికీ చెప్పకుండా భార్యను బయటకు రమ్మని పిలిచాడు. అక్కడ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తనతో తెచ్చుకున్న నైలాన్ తాడును మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం గతంలో ఉన్న పరిచయాలతో ప్రసాద్ వేధిస్తున్నాడని.. అందుకే చనిపోతున్నానని అనూష మొబైల్ నుంచి ఆమె తండ్రి, అన్న, స్నేహితురాలితో పాటు తనకు కూడా మెసేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా భార్య మరణవార్త తెలిసి
అనూష మొబైల్ నుంచి వచ్చిన మెసేజ్ చూసిన కుటుంబసభ్యులు ప్రసాద్ ఇంటికి వెళ్లి దాడికి దిగారు. దీంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రసాద్‌కు అనూషకు మధ్య ఏడాది నుంచి ఎలాంటి కాల్ సంభాషణలు లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అనూష మొబైల్ నుంచి ఒకేసారి నలుగురికి మెసేజ్‌లు వెళ్లాయనే కోణంలో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే అనూష భర్త జగదీశ్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది.