తిరుమల : వారాంతపు సెలువు రోజుల కారణంగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 6 కంపార్టుమెంట్లలో ఉండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 80,871 మంది భక్తులు దర్శించుకోగా 24,257 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.78 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
తిరుమలలోని బూందీపోటు, పరకామణి భవనంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు (BR Naidu) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరకామణి భవనంలో నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏవిధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు.
పరకామణి భవనంలో సీసీ టీవీ నిఘా, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. బూందీపోటులో బూందీ తయారీ, నెయ్యి టిన్లు , పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి పలువురు భక్తులతో మాట్లాడారు. లడ్డూ బరువును లడ్డూ కేంద్రంలో తూకం వేసి పరాశీలించారు.