అమరావతి : ఏపీలో సంపద సృష్టించడం దేవుడెరుగు.. అప్పులు(Debits) సృష్టించడంలో చంద్రబాబు నంబర్‌వన్ అవుతున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. సంపద సృష్టించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, అక్రమ కేసులు (False Cases) పెడుతున్నారని వెల్లడించారు. వైసీపీ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత వైసీపీ ప్రభుత్వంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) నాయుడు అసత్యాలు, తప్పుడు అంకెలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం (Polavaram) ప్రాజెక్టు విషయంలో ప్రజలను మోసం చేస్తున్నది చంద్రబాబేనని, బాబు అనాలోచిత నిర్ణయం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. 2014-19 వరకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ వల్ల పోలవరానికి తీరని నష్టం జరిగిందని విమర్శించారు.
వైఎస్ జగన్ హయాంలో డయాప్రం వాల్, స్పిల్‌వే కట్టామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి పిల్లాడికి రూ.15 వేలు ఇస్తామన్న వాగ్దానం ఏమైందని నిలదీశారు. తల్లికి వందనం.. పిల్లలకు మాత్రం పంగనామాలు పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ఒకమాట, వచ్చిన తరువాత మరో మాట మాట్లాడడం చంద్రబాబుకు అలవాటని విమర్శించారు. ఉచిత ఇసుక అంటూనే డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.