Gudivada Amarnath | ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. సీఎంగా ఆయన ఏం పనిచేస్తారో చెప్పకుండా.. ఎంతసేపు వైసీపీని నిందించడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం పనులు శరవేగంగా జరగడానికి తాము ఎంతో కృషి చేశామని చెప్పారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేశామని అన్నారు. వైసీపీ చేసిన ప్రగతిని.. కూటమి అకౌంట్లో వేసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవంటూ ఎద్దేవా చేశారు.
విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామని అంటున్న మాటలను తన చిన్నప్పటి నుంచి వింటున్నా అని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అది ఆచరణలో ఎక్కడా లేదని అన్నారు. ప్రజలకు మంచి జరగాలన్నదే తమ ఆశయమని చెప్పారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేవరకు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వ ఉడత బెదిరింపులకు భయపడేది లేదని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వైసీపీపై ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే కోరిక ఉండాలి.. కానీ ఇలా ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేశారని తెలిపారు.