Chandrababu | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : తెలుగువారి అభ్యున్నతికి తానే కారణమని, దేశ రాజకీయాల్లో తనను మించినవారు లేరని, అభివృద్ధికి తానే ఆద్యుడిననే రీతిలో ప్రగల్భాలు పలుకుతూ నెటిజెన్ల చేతిలో నిత్యం ట్రోలింగ్‌కు గురయ్యే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా తనదైన ట్రేడ్‌మార్క్ సెల్ఫ్ డబ్బా మళ్లీ కొట్టుకున్నారు. ఈ సారి ఓ అడుగు ముందుకేసి తాను నాడు తెచ్చిన ఐటీ పాలసీ వల్లనే నేడు 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారని సెలవిచ్చారు.
దావోస్ పర్యటనలో బాబు అక్కడి తెలుగు వారితో జరిగిన సమావేశంలో ఈ మేరకు డబ్బా కొట్టుకున్నారు. తాను నాడు తెచ్చిన ఒక పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలని తీసుకున్న నిర్ణయమే 195 దేశాల్లో తెలుగు వారు సెటిల్ కావడానికి కారణమని చెప్పుకొచ్చారు. ఈ నెలలోనే ఆయన కోహినూర్ డైమండ్‌ను తాను ఎక్కడ తీసుకెళ్లిపోతానో అనే భయంతో లండన్ పోలీసులు తనపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజకీయాల్లో తన కంటే సీనియర్ ఎవరూ లేరని కూడా చెప్పుకొచ్చారు. బాబు డాబు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలలో సెటైర్లు పేలుతున్నాయి. ‘సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో మీకు మీరే సాటి.. బాబు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘రాష్ర్టాల నుంచి వలసలు పెరుగుతున్నాయని, ఏ సీఎం కూడా చెప్పుకోరని.. మీ పనితనంతోనే ఉద్యోగాలు దొరక్క ఇతర దేశాలకు తరలివెళ్తున్నారు’ అంటూ చురకలు అంటిస్తున్నారు. ‘ముందు ఏపీని అభివృద్ధి చేసి గొప్పలు చెప్పుకొవాలి’ అని సలహా ఇస్తున్నారు. ‘వయసు మీద పడటంతో బాబు ఇలా ప్రవర్తిస్తున్నారని, ఇది చాలా సీరియస్ ఇష్యూ’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.