అమరావతి : ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ (Chhattisgarh encounter ) పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి(Supreme Court Judge) తో విచారణ జరిపించాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ భారీ ఎన్కౌంటర్లో చనిపోయిన మృతుల ఫొటోలను, వివరాలను స్పష్టంగా విడుదల చేయాలని ఛత్తీస్గడ్ ప్రభుత్వాన్ని కోరింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండూర్ – తులతులీ గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల పోలీసులు, డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు గురువారం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలు – మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 36 మంది మావోయిస్టుల మృతి చెందారు.
మావోయిస్టులకు చెందిన అధునాతన ఆయుధాలు, ఇతర సామగ్రిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారు. మృతుల్లో దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు, మావోయిస్టు కార్యదర్శి కేశవరావు, అమరేష్ అలియాస్ రామకృష్ణ, నీతి అలియాస్ ఊర్మిళ తదితరులున్నట్లు సమాచారం. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు.