అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ( YCP) పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ( Chandra Babu ) పలు అంశాలపై వైసీపీ వైఖరిని తప్పుబట్టారు. వైఎస్ జగన్కు( YS Jagan ) ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. అసలు ఆ పార్టీ నాయకులకు బుద్ధుందా అంటూ మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ( Opposition status ) ఇవ్వాల్సింది ప్రజలు.. తాము కాదని మరోసారి స్పష్టం చేశారు.
మీ అరాచకాలు తట్టుకోలేక ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అన్నారు. గుండెపోటు, కోడికత్తి, గులకరాయి అంటూ డ్రామాలు ఆడి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూశారని విమర్శించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై శ్రద్ధ ఉంటే అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ విషప్రచారం చేస్తోందని పరోక్షంగా వైసీపీపై ధ్వజమెత్తారు.
ఏపీలో ఎరువుల ( Fertilisers ) కొరత లేదని వివరించారు. అన్ని జిల్లాల్లోనూ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, మరో పది రోజుల్లో 44,580 టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తోందని వెల్లడించారు. గత పదిరోజుల్లో 25 వేల టన్నుల యూరియా పంపిణీ చేశామని పేర్కొన్నారు. కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారని, దారి మళ్లించిన రూ. 3 కోట్ల విలువైన యూరియాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఫేక్ రాజకీయాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని, ఎరువుల కొరత సృష్టించినా తప్పుడు ప్రచారం చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.