CM Chandrababu Naidu | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఏపీలో పింఛన్ రూ. 4 వేలకు పెంచుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేశారు. పెంచిన పెన్షన్‌ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని మంత్రులు తెలిపారు. జూలై ఒకటిన వృద్ధులకు 3 నెలల పెంచిన పెన్షన్‌తో కలిపి రూ.7వేలు ఇస్తామని చెప్పారు.
టీటీడీని ప్రక్షాళన చేస్తాం
రాష్ట్రంలో టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని, తిరుమల పవిత్రతను కాపాడుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొకులు చెల్లించుకున్నారు. అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కుటుంబసమేతంగా పూజలు చేశారు.