YS Jagan | ఏపీలో చంద్రబాబు పాలన చూస్తుంటే కలియుగం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా బురదవేసి కడుక్కోమంటున్నారని విమర్శించారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మంగళవారం నాడు వైఎస్ జగన్‌ను సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్రమ కేసులు ఎదుర్కొంటున్న నాయకులు, కార్యకర్తలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లాయర్లు అందించిన సేవను ఎప్పటికీ మరిచిపోమని స్పష్టం చేశారు.
మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని జగన్ 2.0లో ప్రత్యేకంగా గుర్తిస్తామని తెలిపారు. పార్టీకి పనిచేసే వారికోసం డేటాబేస్ పెడుతున్నామని చెప్పారు. దీని ఆధారంగానే వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కోసం ఎవరు కష్టపడతారో.. వారికే వచ్చే ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. త్వరలోనే యాప్ విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఈ యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. తప్పుచేయకపోయినా దెబ్బలు తింటున్న వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, అన్యాయంగా బాధ పెట్టిన వ్యక్తికి కూడా అర్థం కావాలని అన్నారు. ఇప్పుడు ఇబ్బంది పెట్టిన అధికారులపై కచ్చితంగా యాక్షన్ ఉంటుందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం మరిచిపోయిందని వైఎస్ జగన్ అన్నారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని విమర్శించారు. లిక్కర్లో అవినీతి విపరీతంగా ఉందని.. ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతున్నారని, ప్రతి గ్రామంలోనూ వీధికో బెల్టు షాపు ఉందని అన్నారు. ఉచిక ఇసుక పేరుతో దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఉచిత ఇసుక ఎవరికి ఇస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదని, కొంతమంది పోలీసులు దగ్గరుండి పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారని అన్నారు.
అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతుందని వైఎస్ జగన్ అన్నారు. చదరపు అడుగుకు రూ.10వేలు ఖర్చు చేస్తున్నారని.. చదరపు అడుగుకు రూ.4 వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయని తెలిపారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. 10 శాతం ఇచ్చి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.