Tirumala | తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఒక వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల పరిమితిని పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై రోజుకు రెండు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనానికి ఎమ్మెల్యేల నుంచి రోజుకు ఒక సిఫారసు లేఖను మాత్రమే అనుమతిస్తున్నారు. దీని స్థానంలో రెండో లెటర్‌ను కూడా అనుమతించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. రెండో సిఫారసు లేఖను అనుమతించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే వారానికి ఆరు రోజులు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల పరిమితిని పెంచబోతున్నట్లు వస్తున్న వార్తలతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. అయితే దీనిపై అటు ప్రభుత్వం గానీ.. ఇటు టీటీడీ అధికారులు మాత్రం స్పష్టతనివ్వలేదు.