YS Sharmila | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాదిగా అవతారం ఎత్తారని విమర్శించారు. బీజేపీ మనిషిలా మారిపోయారని.. రైటిస్ట్ భావజాలాన్ని అలవరచుకున్నారని అన్నారు.
చంద్రబాబు భారత రాజ్యాంగం బదులు RSS రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. సర్వమత సమ్మేళనం లాంటి రాష్ట్రంలో ఒక మతానికే పెద్దపీట వేస్తున్నారని అన్నారు. దళితవాడల్లో 5వేల గుడులను TTD తరఫున కట్టిస్తామని తిరుపతిలో సీఎం ప్రకటించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
BJP అంటే ఈ దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ అని వైఎస్ షర్మిల విమర్శించారు. మతం పేరిట మంటలు రాజేసి అందులో చలి కాచుకునే పార్టీ అని అన్నారు. కేంద్రంలో ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది అంటే బాబు మద్దతుతోనే అని పేర్కొన్నారు. ఈ మధ్య ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో RSS అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో ఆయన బీజేపీ పార్టీలో చేరారనే విషయం తేటతెల్లం అయ్యిందని అన్నారు. దళితవాడల్లో ఐదు వేల గుడులు కావాలని ఎవరు అడిగారని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు.ఇప్పుడు గుడులు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. TTD దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే దళితవాడలను అభివృద్ధి చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా RSS సిద్ధాంతాన్ని నెత్తిన ఎత్తుకొని రాష్ట్రవ్యాప్తంగా గుడులు కట్టడం సరికాదని హితవుపలికారు.
చంద్రబాబు గారు @ncbn పూర్తిగా RSS వాదిగా అవతారం ఎత్తారు. బీజేపీ @BJP4India మనిషిలా మారిపోయారు. రైటిస్ట్ భావజాలాన్ని అలవర్చుకున్నారు. భారత రాజ్యాంగం బదులు RSS రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తున్నారు. సర్వమత సమ్మేళనం లాంటి రాష్ట్రంలో ఒక మతానికే పెద్దపీట వేస్తున్నారు.… pic.twitter.com/P6nLkj8N8t
— YS Sharmila (@realyssharmila) September 27, 2025
అన్ని మతాలకు స్వేచ్ఛ మన రాజ్యాంగం ఇచ్చిందని షర్మిల అన్నారు. కానీ దేశంలో RSS రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. RSS రాజ్యాంగంలో హిందువులు మాత్రమే మనుషులు.. మిగతా మతస్తులు అంతా పురుగులు అని వ్యాఖ్యానించారు. దళితవాడల్లో గుడులు కడితే అక్కడ పూజారులుగా ఎవరు ఉంటారు? బ్రాహ్మణులను పెడతారా ? దళితులను పూజారులు చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దళితుల మీద అంత శ్రద్ధ ఉంటే వారి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవుపలికారు. రాష్ట్రంలోని ఉమెన్ వెల్ఫేర్ హాస్టళ్లలో 228 మందికి ఒకటే బాత్ రూమ్ ఉందట.. ఈ మధ్య హైకోర్ట్ చెప్పింది. గుడులకు బదులు హాస్టల్లో వసతులను కల్పించండని సూచించారు. ఆ బిడ్డల గురించి ఫోకస్ చేయండని హితవుపలికారు. దళిత కాలనీల్లో పారిశుద్ద్యం మీద దృష్టి పెట్టండి. వారికి కావాల్సిన కనీస వసతులను మెరుగుపరచండని సూచించారు. తక్షణమే 5000 గుడులు కట్టే నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని దళితవాడల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
దేశంలో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని వైఎస్ షర్మిల విమర్శించారు. బీజేపీ గెలుపు కష్టం అనుకున్న చోట దొంగ ఓట్లను చేరుస్తున్నారని.. బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని.. ఓట్లను ఇతర నియోజక వర్గాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రజలకు ఓటు హక్కు ఇచ్చిందని.. అందరినీ సమానంగా చూసేది ఓటు మాత్రమే అని తెలిపారు. ఇలాంటి ఓటు వ్యవస్థను బీజేపీ కలుషితం చేసిందని అన్నారు. అందుకే బీజేపీ మీద దేశవ్యాప్త ఉద్యమం చేపట్టామని తెలిపారు. అన్ని రాష్ట్రాలలో సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతుందని చెప్పారు. ఇందుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. బీజేపీ ఓట్ చోరీ విధానాలను ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. ఈ దేశంలో అన్ని వ్యవస్థలు బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుందని అన్నారు. EC సైతం బీజేపీ గుప్పిట్లో ఉందని.. ఎన్నికల సంఘం బీజేపీ తొత్తుగా మారిందని విమర్శించారు. రాహుల్ గాంధీ రెండు నియోజకవర్గాల్లో జరిగిన ఓట్ చోరీని స్పష్టంగా వివరించారన్నారు. మహాదేవపుర నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు లక్ష ఓట్లను తొలగించారని.. అలంద్ నియోజక వర్గంలో వేల ఓట్లు తొలగించారని.. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికలకు 5 నెలల ముందు 60 లక్షల కొత్త ఓట్లు చేర్చారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉండేందుకు ఇన్ని కుట్రలు చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ECI ముందు పలు డిమాండ్ లు పెడితే ఇంతవరకు స్పందన లేదన్నారు. ఎన్నికల రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో లక్షల దొంగ ఓట్లు పోల్ అయ్యాయి. CC ఫుటేజ్ ఇవ్వమని అడిగితే స్పందన లేదు. EC ఇప్పటికైనా బీజేపీ గుప్పిట్లో నుంచి బయటకు రావాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.